తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరం ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం దేశంలోనే మేజర్ టెక్నాలజీ హబ్ గా దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్- 2024 తాజాగా విడుదల చేసిన లిస్టులో హైదరాబాద్ నగరం నాలుగో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో కర్ణాటక రాజధాని బెంగళూరు తొలి స్థానంలో ఉంది. వియత్నాంలోని హో చి మిన్ సిటీ ఉంది. మూడో స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఆసియా ఖండం ముందంజలో ఉన్నట్లు సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్- 2024 స్పష్టం చేసింది. 2033 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏఏ నగరాలు సమర్థవంతమైన అభివృద్ధిని సాధిస్తాయని నివేదిక అంచనా వేసింది. ఎకానమీ, జనాభా, వ్యక్తిగత సంపద.. తదితర అంశాలను పేరామీటర్స్ గా తీసుకుని వాటిని క్రోడీకరించి రిపోర్టును తయారు చేసినట్లు సావిల్స్ గ్రోత్ స్పష్టం చేసింది.
సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్- 2024 తో కలిపి సావిల్స్ రిసైలెంట్ సిటీస్ ఇండెక్స్ సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా 230 నగరాల్లో అధ్యయనం చేసింది. వచ్చే పదేళ్లలో ఏఏ నగరాలు అభివృద్దిలో పోటీపడుతున్నాయో అంచనా వేశారు. ఈ రిపోర్టు ప్రకారం ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీస్ లోని టాప్ 15 లో 14 నగరాలు ఆసియా ఖండంలోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో దాదాపు 90 శాతం పట్టణాభివృద్ధి పెరుగుతోందని రిపోర్టు పేర్కొంది. మరోవైపు యూనైటెడ్ నేషన్స్ అంచనా ప్రకారం 68 శాతం ప్రపంచ జనాభా 2050 నాటికి నగరాల్లో జీవిస్తుందని అంచనా వేసింది.
హైదరాబాద్ లో టెక్ రంగం గణనీయంగా అభివృద్ది చెందుతోందని సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్- 2024 రిపోర్టు పేర్కొంది. హైదరాబాద్ లో టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, రియల్ ఎస్టేట్.. తదితర రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు ఐటీ రంగంలో అగ్రగామిగా దూసుకెళ్తున్నట్లు రిపోర్టు ప్రచురించింది. ఈ లిస్టులో బెంగళూరు టాప్ ప్లేస్ లో దూసుకెళ్తున్నట్లు పేర్కొంది.








