పఠాన్‌చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ(ఆదివారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు దట్టంగా వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు. ఈ విషయంపై స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకి సమాచారం అందజేశారు. ఘటన స్థలానికి అగ్నిమాపక అధికారులు చేరుకున్నారు.
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఘటన స్థలంలో మూడు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అగ్నిమాపక అధికారులు అదుపుచేస్తున్నారు. స్థానికులని ఘటన స్థలం నుంచి దూరంగా అధికారులు పంపించి వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. అయితే. ప్రమాద సమయంలో కార్మికులు పరిశ్రమలో ఎవరూ లేరనే సమాచారం. అయితే ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..








