A9 న్యూస్ మెదక్ ఆగస్టు 28:
మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారులు, వంతెనలు దెబ్బతిని ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు జిల్లా ఇంచార్జ్ మంత్రి .వివేక్ వెంకట స్వామి స్వయంగా గ్రామాలకు వెళ్లే మార్గాలలో కొట్టుకుపోయిన వంతెనలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.
వర్షాల కారణంగా రహదారులు కొట్టుకుపోవడంతో, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, వెంటనే ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. ప్రధాన మార్గాలపై పోలీసులు చేరుకొని వాహనాలను సురక్షిత మార్గాలకు మళ్లిస్తున్నారు.
అదే విధంగా వాగులు, వంకలు, వంతెనలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్న ప్రమాదకర ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ పికెట్ల ఏర్పాటు చేయించారు. నీరు రహదారులపైకి చేరిన చోట్ల వాహనదారులు ప్రయాణించకుండా హెచ్చరికలు ఇస్తున్నారు. ప్రజలు అతిగ ఉత్సాహానికి లోనుకాకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.
జిల్లాలో ఎప్పటి కప్పుడు వర్షాల పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైనచోట్ల రక్షణ చర్యలు తీసుకునేందుకు పోలీసు బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ గారు తెలిపారు. ప్రజల భద్రతే ప్రాధాన్యమని, అవసరం లేని ప్రయాణాలు చేయవద్దని ఎస్పీ గారు సూచించారు.








