మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు….

On: Tuesday, October 28, 2025 10:49 AM

 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ అధికారులు భారీ హెచ్చరిక జారీ చేశారు. మొంథా తుఫానుతో తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటితే తెలంగాణలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఇవాళ్టీ(మంగళవారం) నుంచి 29, 30తేదీలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఇప్పటికే.. పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.

దక్షిణ, మధ్య తెలంగాణ మ్యాప్‌లో ముఖ్యంగా ఎరుపు రంగులో మార్క్ చేయబడిన జిల్లాల్లో చాలా భారీ వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల 90-150 మి.మీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.

నీలం రంగులో మార్క్ చేయబడిన జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు. కొన్ని చోట్ల 40-70 మి.మీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

కాగా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు జలమయం అయ్యాయి. అలాగే.. ఇవాళ(మంగళవారం) కూడా.. నగరంలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయన్నారు. సాయంత్రం తరువాత వర్షాలు తగ్గే అవకాశం ఉన్నట్లు చెప్పారు. వర్షాల నేపథ్యంలో.. అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే.. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు..

11 Nov 2025

Leave a Comment