హత్యపై సీపీ కీలక వ్యాఖ్యలు – “సాయం చేయడమే మన మనుష్యత్వం”….

On: Saturday, October 18, 2025 6:28 PM

 

A9 న్యూస్ ప్రతినిధి, నిజామాబాద్:

నిజామాబాద్ నగరంలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఘటనపై కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన — “సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఎంతో దురదృష్టకరం. పోలీస్ కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది,” అన్నారు.

సీపీ వివరించినట్లుగా, నిందితుడు రియాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్న సమయంలో కానిస్టేబుల్ ప్రమోద్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన వెంటనే ఆస్పత్రికి తరలించినా, చికిత్స ఫలించలేదని తెలిపారు.

“ఫొటోలు తీసే బదులు సాయం చేయండి”

ఈ ఘటనలో ప్రజల నిర్లక్ష్యంపై సీపీ ఆవేదన వ్యక్తం చేశారు.

“దాడి జరిగినప్పుడు పోలీసులు సహాయం కోరినా ఎవరూ ముందుకు రాలేదు. ఆటోలు ఆపి ఆస్పత్రికి తీసుకెళ్లమని అడిగినా స్పందించలేదు. జనమంతా వీడియోలు, ఫొటోలు తీస్తూ ఉండిపోయారు,” అని పేర్కొన్నారు.

ప్రతీ ఒక్కరూ మానవత్వంతో స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

“పోలీసే కాక, ఎవరైనా రోడ్డుపై పడిపోయి ఉన్నా సాయం చేయాలనే గుణం మనలో ఉండాలి. ‘మాకెందుకనే’ ఆలోచన సమాజానికి ప్రమాదం,” అని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు.

“ప్రజల భద్రతకే మా ప్రాణాలు పణంగా”

పోలీసులు ప్రజల రక్షణ కోసం అహోరాత్రులు కృషి చేస్తున్నారని, ఎన్నో నేరాలను అడ్డుకుంటూ, ఛేదిస్తూ ప్రజల భద్రతను కాపాడుతున్నామని సీపీ తెలిపారు.

“ప్రమోద్ వంటి ధైర్యవంతుడైన కానిస్టేబుల్ ఒక నేరాన్ని ఛేదించే క్రమంలో ప్రాణం కోల్పోయాడు. ఇది పోలీస్ శాఖకు, సమాజానికి పెద్ద నష్టం,” అని అన్నారు.అంతిమంగా సీపీ పిలుపునిచ్చారు.

“అపదలో ఉన్న వారిని సాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈరోజు మనం సాయం చేస్తే, రేపు మనకోసం ఎవరో సాయం చేస్తారు.”

11 Nov 2025

Leave a Comment