
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ప్రజల రక్షణ, సురక్షిత జీవనం లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని స్థానిక పెర్కిట్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి పలు కీలక సూచనలు చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకూడదని, రాత్రి వేళల్లో అనవసరంగా తిరగరాదని హెచ్చరించారు.
ముఖ్యంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఈవ్ టీజింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. అలాగే గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు బయటి రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని, సరైన ధ్రువపత్రాలు లేకుండా ఇళ్లను అద్దెకు ఇస్తే యజమానులపై కూడా కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు.
ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో సుమారు 70 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 120 ఇండ్లను తనిఖీ చేయగా,
సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే 3 సస్పెక్ట్ షీట్ వ్యక్తులను చెక్ చేయగా, ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా 15 మందిని గుర్తించారు. నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన వాహనాలు, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన వాహనాలు, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ఆటోలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్, వెంకటేశ్వర్లు రెడ్డి ఏసిపి ఆర్మూర్, సీఐలు సత్యనారాయణ గౌడ్ (ఆర్మూర్ టౌన్), శ్రీధర్ రెడ్డి (ఆర్మూర్ రూరల్) తో పాటు ఆర్మూర్ డివిజన్‌కు చెందిన 9 మంది ఎస్సైలు, ఏఎస్ఐలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.








