A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
భాద్గుణ గ్రామంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా చిల్మెల స్వప్న సూదన్ సోమవారం గ్రామ సర్పంచ్‌గా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత భారీ సంఖ్యలో హాజరై నూతన సర్పంచ్‌కు ఘన స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారంతో భాద్గుణ గ్రామ పాలనకు నూతన అధ్యాయం ప్రారంభమైంది. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పేద–బడుగు–బలహీన వర్గాల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని స్వప్న సూదన్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “నాపై విశ్వాసం ఉంచి బాధ్యత అప్పగించిన భాద్గుణ గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటాను. మాటలకే పరిమితం కాకుండా పనితోనే పాలన చేసి చూపిస్తాను. వచ్చే ఐదు సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాను” అని గట్టిగా ప్రకటించారు. భాద్గుణ గ్రామ ప్రజలు ఈ ప్రమాణ స్వీకారాన్ని భవిష్యత్ అభివృద్ధికి బలమైన సంకేతంగా అభివర్ణిస్తున్నారు.








