వరంగల్‌ రహదారిపై కారు బీభత్సం….

On: Monday, November 3, 2025 10:20 AM

 

అదుపుతప్పి దంపతులపైకి దూసుకెళ్లిన వాహనం — అక్కడికక్కడే మృతి.

యాదాద్రి భువనగిరి జిల్లా  వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలబడి ఉన్న దంపతులపైకి దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఫోన్ మాట్లాడుతుండగా అదుపు తప్పిన కారు.

మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా బోడ్డుప్పల్‌కు చెందిన గర్దాసు ప్రశాంత్‌ (32), ప్రసూన దంపతులు ఆదివారం వరంగల్‌ జిల్లా పాలకుర్తిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. బీబీనగర్‌ పెద్దచెరువు సమీపానికి రాగానే ప్రశాంత్‌కు ఫోన్ రావడంతో రోడ్డు పక్కన బైక్‌ ఆపి మాట్లాడుతుండగా, హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చిన ఓ కారు అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది.

ప్రశాంత్‌ రోడ్డుపై 20 అడుగుల దూరంలో పడిపోయి మృతి చెందగా, ప్రసూన చెరువు అలుగు ప్రదేశంలో పడిపోయి అక్కడికక్కడే మృతిచెందింది. కారు ఆపై చెట్టును ఢీకొని సర్వీస్‌ రోడ్డుపై పడిపోయింది.

ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు:

కారు నడిపిన షణ్ముక్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న భార్గవ్‌, సాయిరిత్‌లకు కూడా గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ముగ్గురు యువకులను హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

యాదగిరిగుట్ట దర్శనానికి బయలుదేరిన యువకులు:

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన తంగెళ్లపల్లి షణ్ముక్‌, చైతన్యపురికి చెందిన భార్గవ్‌, వరంగల్‌ పద్మానగర్‌కు చెందిన సాయిరిత్‌లు ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోవడానికి ఎల్బీనగర్‌లో కారును అద్దెకు తీసుకుని బయలుదేరగా, బీబీనగర్‌ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

11 Nov 2025

Leave a Comment