A9 న్యూస్ ప్రతినిధి భీమ్ గల్:
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో బాల్య వివాహ నిరోధక చట్టంపై గ్రామ, మండల స్థాయి అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ – బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం భీంగల్ ఎంపీడీవో కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్య కుమార్ బాల్య వివాహ నిరోధక చట్టం – 2006 పై శిక్షణ ఇచ్చారు. ఈ చట్టం ప్రకారం బాలుడికి 21 ఏళ్లు, బాలికకు 18 ఏళ్లు నిండకముందు వివాహం జరిపితే అది నేరమని, దానికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా విధించవచ్చని తెలిపారు.
బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రటరీ, మండల స్థాయిలో తహసిల్దార్, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ను నిరోధక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. బాల్య వివాహం జరుగుతుంటే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబరుకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ, బాల్య వివాహం సామాజిక, ఆర్థిక, శారీరక అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, చిన్న వయసులో గర్భం దాల్చడం తల్లి–శిశువుల ప్రాణాలకు ముప్పని పేర్కొన్నారు. బాల్య వివాహాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ మల్లేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు విజయరాణి, శారద, చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్వైజర్ సాయి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.








