తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపికపై ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికపై సుదీర్ఘంగా పార్టీ అధిష్టానం చర్చించనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నాటరాజన్ హాజరుకానున్నారు.
ఈ మీటింగ్‌లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్న వారికి రెండోసారి అవకాశం ఇవ్వకూడదనే దానిపై చర్చించనున్నారు. వరుసగా ఐదేళ్లపాటు పార్టీలో క్రమశిక్షణతో పనిచేసిన వారికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. బీసీ సామాజికవర్గాల నేతలకు డీసీసీ పదవుల్లో ఎక్కువ అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల బంధువులకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వద్దని ఏఐసీసీ మార్గదర్శకాలు విడుదల చేసినట్లు సమాచారం. రాబోయే ఎన్నికలలో టికెట్ల కేటాయింపులపై డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది..








