A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం రామకృష్ణ అనే వ్యక్తి ఇంటి వద్ద మామిడి చెట్టును నరుకుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.
సంతోష్‌నగర్‌కు చెందిన ప్రేమ్ అనే వ్యక్తి, మరో మహిళ, మరో పురుషుడు కలిసి కూలికి చెట్టు నరుకేందుకు వచ్చినట్లు సమాచారం. వారిలో ఒకరు గుర్తు తెలియని వ్యక్తి, వయసు సుమారు 35-40 సంవత్సరాలు చెట్టుపైకి ఎక్కి గొడ్డలితో కొమ్మలు నరుకుతుండగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
తలకు తీవ్ర గాయాలవడంతో మొదట ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, తర్వాత మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాత్రి సుమారు 10:30 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
మృతుడు జీన్స్ ప్యాంట్, తెల్ల బనియన్ ధరించి ఉన్నాడు. ఇంకా అతని పూర్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.








