
ఆరోపణలతో ఆర్మూర్ ప్రెస్ భవన్‌లో మధులత ఆవేదన…
ఆర్మూర్ పట్టణానికి చెందిన కాశిపాక మధులత (డీఎస్సీ–2022 ఎంపికైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) తన భర్త మధనం రాములు నుంచి ప్రాణహాని ఉందంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె భర్త కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడే కాగా, ప్రస్తుతం ఆర్మూర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.
ఇద్దరిదీ ప్రేమ వివాహం కాగా, కులాంతరమైనప్పటికీ పెద్దలను ఒప్పించి 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 18 సంవత్సరాల కుమార్తె (డిగ్రీ) మరియు 14 సంవత్సరాల కుమారుడు (8వ తరగతి) ఉన్నారు.
భర్త రాములు సికింద్రాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పనిచేసిన సమయంలో చాట్ల సంధ్య అనే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని మధులత ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలుగా తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధిస్తూ వస్తున్నాడని తెలిపారు. పెద్దల సమక్షంలో పంచాయతీలు, పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు.
తనను పలుమార్లు కొట్టడంతో పాటు తీవ్ర గాయాలు కూడా కలిగించాడని, ఇటీవల “నిన్ను చంపేస్తా” అంటూ మెసేజ్‌లు పంపి ప్రాణహాని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. మొన్న ఆదివారం రోజున ఆ యువతితో కలిసి ఇంటి నుంచి పారిపోయాడని తెలిపారు.
తన భర్త జీవించి ఉండగానే మరో మహిళను వివాహం చేసుకోవడం చట్టవిరుద్ధం, హిందూ ధర్మానికి విరుద్ధమని మధులత పేర్కొన్నారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఆర్మూర్ ప్రెస్ భవన్‌లో మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించారు.
ఆస్తులన్నీ భర్త పేరు మీదే ఉన్నప్పటికీ, కుటుంబ ఖర్చులు, లోన్ల కోసం తన సంపాదన మొత్తం ఖర్చు పెట్టినట్లు తెలిపారు. భర్త మరో మహిళను పెళ్లి చేసుకుని తమ జీవితాలను నాశనం చేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన తనకే రక్షణ, గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏమవుతుందోనని ప్రశ్నిస్తూ, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని మధులత డిమాండ్ చేశారు.








