నిజామాబాద్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ ప్రారంభం…..

On: Thursday, July 2, 2026 10:30 AM

* నిజామాబాద్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ ప్రారంభం….

* తప్పిపోయిన, నిరాశ్రయ చిన్నారుల గుర్తింపు–రక్షణకు నెల రోజుల ప్రత్యేక కార్యాచరణ….

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ కార్యక్రమాన్ని అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ ప్రారంభించారు. జూలై 1 నుంచి జూలై 31, 2026 వరకు నెల రోజుల పాటు నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా పోలీస్ కమిషనరేట్ పరిధిలో తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయ బాలలు, వీధి బాలలు, బాల కార్మికులను గుర్తించి రక్షించడం, వారికి చట్టపరమైన సంరక్షణ కల్పించడం, కుటుంబాలతో పునఃకలయిక చేయడం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్ మాట్లాడుతూ మహిళా–శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా బాలల పరిరక్షణ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, మార్కెట్లు, హోటళ్లు, ఢాబాలు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు, గ్యారేజీలు, వర్క్‌షాపులు, నిర్మాణ ప్రాంతాలు, ధార్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించి సురక్షితంగా రక్షించి పునరావాసం కల్పించనున్నట్లు వెల్లడించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య, భద్రత, ఆరోగ్యం, రక్షణ కల్పించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. చిన్నారులను పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ పాండేరావు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ ఏ. సురేష్, జిల్లా మహిళా–శిశు సంక్షేమ అధికారి డి. సౌందర్య, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి చైతన్య, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సీహెచ్. ప్రభుదాస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కల్పన, జిల్లా వైద్యశాఖ, విద్యాశాఖ, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ప్రజల సహకారంతో ‘ఆపరేషన్ ముస్కాన్–XII’ను విజయవంతం చేసి ప్రతి చిన్నారి సురక్షితంగా తన కుటుంబానికి చేరేలా కృషి చేయాలని అదనపు డీసీపీ అధికారులకు సూచించారు.

02 Jul 2026

Leave a Comment