తెలంగాణ పత్తి రైతులు వరుస ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వ నూతన నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులు ఇవాళ్టి నుంచి పూర్తిగా బంద్‌కు వెళ్లాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకొచ్చిన ఎల్-1, ఎల్-2 కేటగిరీలు, యాప్ రిజిస్ట్రేషన్ విధానాలు, అలాగే ఎకరానికి కేవలం 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం పట్ల జిన్నింగ్ మిల్లర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు మరోసారి చిక్కుముడి…
ఇప్పటికే అక్టోబర్–నవంబర్ వర్షాలతో పత్తి పంట భారీగా నష్టపోయింది.
• రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది
• పత్తిలో తేమ శాతం 25% దాటడంతో అమ్మకాలు నిలిచిపోయిన రైతులు, ఇప్పుడు తేమ తగ్గినప్పుడు అమ్మకాలు మొదలు పెట్టాలనగా మిల్లుల బంద్‌తో మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు.
సీసీఐ కొనుగోళ్లు దిగజారింపు..
రాష్ట్రంలో ఈ సీజన్‌లో 45.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 27 లక్షల టన్నుల దిగుబడి అంచనా ఉంది. అయితే:
• సీసీఐ ఇప్పటివరకు కేవలం 1.18 లక్షల టన్నులే కొనుగోలు చేసింది.
• గత సంవత్సరం ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేసిన సీసీఐ, ఈసారి 7 క్వింటాళ్లకు తగ్గించింది.
• తేమ 8–12% కంటే ఎక్కువ ఉంటే కొనుగోలు చేయబోమని ప్రకటించడం రైతులపై మరింత భారమైంది.
• ‘కపాస్ కిసాన్ యాప్’ లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడంతో స్మార్ట్‌ఫోన్ లేని రైతులు విక్రయ ప్రక్రియలో ఇరుక్కుపోతున్నారు.
ఇక దిగుమతి సుంకాలు తగ్గడంతో బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడం రైతుల నష్టాలను మరింత పెంచింది.
మిల్లర్ల ఆరోపణలు..
జిన్నింగ్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ:
“ఎల్-1, ఎల్-2 విధానాలు పూర్తిగా అన్యాయం. సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా సీసీఐ స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మిల్లులు బంద్ తప్పలేదు” అని తెలిపారు.
ఎవరికి ‘డబుల్ బ్లో’?
✔ వరుస వర్షాలతో పంట నష్టం
✔ తేమ పెరిగి అమ్మకాలు నిలిచిపోవడం
✔ సీసీఐ నిబంధనల కఠినత
✔ జిన్నింగ్ మిల్లుల సమ్మె
✔ బహిరంగ మార్కెట్‌లో దళారుల ఒత్తిడులు.








