దృఢ సంకల్పంతో గ్రామాభివృద్ధికి నడుం బిగించిన కొండ్ర కమల దశరథ్…
ఆలూర్ మండలం, గుత్ప గ్రామం:
చదువు లేకపోయినా దృఢమైన సంకల్పం, అంకితభావం, సేవాభావంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ముందుకొచ్చిన కొండ్ర కమల దశరథ్‌ను గుత్ప గ్రామ ప్రజలు ఘనంగా ఆదరించారు. గ్రామానికి ఏదో మంచి చేయాలన్న తపనతో ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను తెలుసుకుంటూ సేవ చేస్తున్న ఆయనను గ్రామ సర్పంచ్‌గా ప్రజలందరూ కలిసి భారీ మెజార్టీతో ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కొండ్ర కమల దశరథ్ మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమ పథకం గుత్ప గ్రామంలోని ప్రతి అర్హుడైన వ్యక్తికి అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలు, రైతులు, కూలీలు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.
రేషన్ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సహాయ పథకాల విషయంలో అర్హులకు న్యాయం జరిగేలా ముందుండి పనిచేస్తానని చెప్పారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి గుత్ప గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చినా తానే ముందుండి పరిష్కారం చూపుతానని, ఎల్లవేళలా గ్రామస్తులకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఈ విజయం గుత్ప గ్రామంలో అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభమైందని గ్రామ పెద్దలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








