A9 న్యూస్ ఆర్మూర్, జూలై 28:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో మంగళవారం జగిత్యాల డిపోకు చెందిన TS21T5517 నంబర్ గల ఆర్టీసీ బస్సు వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నిజామాబాద్ వెళ్లేందుకు ప్లాట్‌ఫామ్‌పై నిలిపిన బస్సులోకి ఎక్కిన ప్రయాణికులకు, బస్సు సాంకేతిక కారణాలతో (ఖరాబ్) నడవదని చెబుతూ లేడీ కండక్టర్ కిందికి దిగాలని సూచించారు. అయితే, బస్సు ఖరాబ్ అయితే ప్లాట్‌ఫామ్‌పై ఎందుకు ఉంచారని ప్రయాణికులు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ సందర్భంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకంపై కూడా మాటామాటా పెరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. దీనికి ప్రయాణికులు స్పందిస్తూ, అది ప్రభుత్వ పథకమని, అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని పేర్కొన్నట్లు సమాచారం.
వివాదం ముదరడంతో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ సిబ్బంది పలుమార్లు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనంతరం, ప్రయాణికులు బస్సు నుంచి దిగే వరకు బస్సును కదపబోనని లేడీ కండక్టర్ చెప్పినట్లు సమాచారం. ప్రయాణికులు దిగిన తర్వాతే బస్సును అక్కడి నుంచి తరలించినట్లు తెలిసింది.
ఈ ఘటనతో కొంతసేపు ఆర్మూర్ బస్టాండ్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరుతున్నారు.








