ప్రకృతిని కాపాడితే..ప్రకృతి మనల్ని కాపాడుతుంది. –అభిలాష్ తుమ్మ మచ్చర్ల .
ఆధ్యాత్మిక అన్వేషి, శాకాహార ప్రచారకులు…
*ప్రకృతికి, పర్యావరణానికి, భూమికి, చెట్లకి, జీవులకి చేసే నష్టాలన్నీ చేస్తూ వర్షాలు పడట్లేదు అంటే ఎలా.?
అడవులను నరికేసి, కొండలు తవ్వేసి ప్రకృతి అసమతుల్యతని దెబ్బతిస్తే వర్షాలు ఎలా పడతాయి దీనికి కారణమైన మనిషి ఒక్క క్షణం ఆగి ఆలోచించవలసిన క్షణం ఇది. మానవాళి భూతదయ, కరుణ తనలో పెంచుకోమని ప్రకృతి ఎప్పటి నుండో సందేశాలు పంపిస్తూనే ఉంది అయినా, మనిషి చెవిన పెట్టక ఆర్థిక వేటలో, ఆడంబరాల మాయలో పడి రాబోయే తరానికి అందించవలసిన ప్రకృతి సంపదను అభివృద్ధి పేరిట నాశనం చేస్తూ ఉంటే ఎలా.?
*జంతువులు, పక్షులు మరియు ఇతర జీవాలు.. ప్రకృతికి మిత్రులు, మనిషికి మేలు చేసే జీవులు.
జంతువులు పక్షులు ఇతర జీవాలు అవి ప్రకృతితో మమేకమై ఈ భూమికి ప్రత్యక్షంగా,మానవాళికి పరోక్షంగా ఎంతో ఉపయోగపడే జీవాలు కానీ మనిషి అది గుర్తించక, తన ఆహారం కోసం వాటిని చంపి ప్రకృతి చక్రాన్ని మార్చి వాతావరణ స్థితిగతులకు కారణమౌతున్నాడు.
*మానవుడి ఆహారం మాంసాహారం కాదు…
నిజానికి మానవుడి ఆహారం మాంసాహారం కానే కాదు.మనిషి శరీర నిర్మాణం మాంసాహారానికి సంబంధించినదిగా లేదు. పులి, సింహం, కుక్క, నక్క, పిల్లి ఇలా కొన్ని జంతువుల దంతాలు కోరల్లా మాంసాన్ని ఉన్నపళంగా పీక్కోని తినడానికి నిర్మాణం చేయబడినవిగా ఉంటాయి కనుక వాటి జీర్ణప్రక్రియ కూడా అలాగే నిర్మించబడింది. కొన్ని పక్షులు ధాన్యాలు తింటాయి వాటి జీర్ణప్రక్రియ వేరేలా ఉంటుంది. మనిషి ఒక్కడే ఏది పడితే అది తింటున్నాడు అందుకే రోగాలపాలు అవుతున్నాడు. మాంసం లో ఉండే పోషకాల కన్నా ఎక్కువ పప్పు ధాన్యాలు, పండ్లు కూరగాయలలో ఉన్నాయని నిరూపితమైనా కూడా బెత్తెడు నాలుక రుచి కోసం, ఆరడుగుల దేహాన్ని పాడుచేసుకుంటున్నాడు మనిషి. కనుక శాకాహార జీవితమే ఇటు మనిషికి, అటు ప్రకృతికి మేలు చేస్తుంది.
*హింస కాదు కరుణయే మార్గం…
జిహ్వా చాపల్యం కోసం, వినోదం కోసం, బలుల పేరుతో ఏ జీవిని హింసించి చంపే హక్కు మనిషికి లేదు, ఫలితంగా ఆ మూగ జీవుల ఆక్రోశాలే యమపాశాలై మానవాళికి ఉచ్చు బిగసుకుంటుంది.
*ప్రకృతితో సమతుల్యతతే భవిష్యత్తు…
ఇప్పటికైనా మనిషికి కనువిప్పు కలగాలి, మారాలి తన సాటి జీవరాశిని, వృక్షజాతిని తమ తోబుట్టువులుగా చూసుకుంటే ఆ ప్రకృతిమాత కరిగి తిరిగి అన్నీ కాలాలు సవ్యంగా జరిగేలా చేస్తుందనడంలో సందేహం లేదు.








