ప్రభుత్వ భూమిలో అక్రమ లావాదేవీలు…

On: Monday, September 15, 2025 5:18 PM

 

అధికారులకు బెదిరింపులు..

నందిపేట్, సెప్టెంబర్ 15 :

నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నం. 40/7/28లో రెండు ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమి చుట్టూ మళ్లీ కలకలం రేగింది. ఆ భూమిని నిజామాబాద్‌కు చెందిన పదవీ విరమణ పొందిన ప్రధానోపాధ్యాయుడు అరవింద్ అక్రమంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూమిని కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిసీ, ఆయన ఆస్తిని స్వాధీనం చేసుకోవడంతోపాటు, దానిని వెంచర్ చేయాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రహరీ గోడ నిర్మించి, స్థానిక కార్యదర్శికి వెంచర్ అనుమతులు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. “అనుమతి ఇవ్వకపోతే తానేంటో చూపిస్తా” అంటూ అధికారులను బెదిరించినట్లు ప్రచారం.

ఇదే కాకుండా, గతంలో 1993లో రూ.100 స్టాంప్ పేపర్లపై గజాల వారీగా అమ్మకాలు జరిపి, ఇప్పుడు ఆ భూమిపై వ్యాపార సముదాయాలు కట్టుకుంటున్న మాజీ విఆర్వో పేరూ వినిపిస్తోంది. దీంతో ఇద్దరు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ భూములపై అక్రమ లావాదేవీల్లో భాగమయ్యారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు అయితే, “ప్రభుత్వ భూమిని వెంచర్ చేయమని అధికారులకు బెదిరించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నిస్తున్నారు. ఇదే భూమికి సంబంధించిన పాస్ బుక్ ఖాతా నంబర్ 290లో రెండు సర్వే నంబర్లు నమోదు కావడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది.

స్థానికులు ఈ వ్యవహారంపై విచారణ జరిపి, అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

21 Jan 2026

Leave a Comment