A9 news
బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న లైన్మెన్ వీర్ కుమార్పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో నగదు వసూలు చేసి, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా స్వంత అవసరాలకు వినియోగించుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటన వల్ల పలువురు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. బిల్లులు చెల్లించినప్పటికీ రికార్డుల్లో బకాయిలుగా చూపించడంతో, విద్యుత్ సరఫరా నిలిపివేస్తారేమోనన్న భయం గ్రామస్తుల్లో నెలకొంది.
గ్రామంలో చాలామంది బాధితులు ఉన్నట్లు తెలుస్తుండటంతో, ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే బాధితుల నుంచి అక్రమంగా వసూలు చేసిన మొత్తాన్ని లైన్మెన్ వీర్ కుమార్ నుండి తిరిగి రాబట్టి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే అధికారులపై కఠిన చర్యలు అవసరమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.







