మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు

On: Tuesday, December 16, 2025 8:11 PM

A9 న్యూస్ ఆర్మూర్:

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రకాల పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.

ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో 148 గ్రామపంచాయతీలు, 1496 పోలింగ్ స్టేషన్లు, 3,26,029 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ ఎన్నికల కోసం 1100 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

*ఎన్నికల నిర్వహణ దృష్ట్యా:*

* పోతంగల్, సాలూర, ఖండ్గావ్ ప్రాంతాల్లో మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి 24/7 వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

* 60 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు.

* 24 ఎఫ్‌ఎస్‌టీ బృందాలు, 4 ఎస్‌ఎస్‌టీ బృందాలు మోహరించారు.

* అక్రమ మద్యం తరలింపుపై చర్యలు తీసుకుని 6 కేసుల్లో 100.24 లీటర్ల మద్యం (విలువ సుమారు ₹77,447) స్వాధీనం చేసుకున్నారు.

* ఆర్మూర్ డివిజన్ పరిధిలో 194 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై కమర్‌పల్లి, నందిపేట్ పోలీస్ స్టేషన్లలో 2 కేసులు నమోదు చేశారు.

* గన్ లైసెన్సులు కలిగిన 18 మందిలో 11 మంది ఆయుధాలు డిపాజిట్ చేయగా, మిగిలినవి బ్యాంకులకు సంబంధించినవిగా తెలిపారు.

అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే 163 బీఎన్‌ఎస్‌ఎస్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

03 Mar 2026

Leave a Comment