డాన్సర్ అసోసియేషన్ ఎన్నికల్లో సుమలత ఘనవిజయం…..

On: Tuesday, December 9, 2025 10:04 AM

 

హైదరాబాద్:డిసెంబర్ 09

తెలుగు సినిమా, టీవీ డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషా ఘన విజయం సాధించారు. మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా… సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు 199 ఓట్లు మాత్రమే దక్కాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు లభించాయి.

ఈ ఫలితాలతో 29 ఓట్ల భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఎలాంటి గ్రూప్ సపోర్టు, పెద్దల బలమైన బహిరంగ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించడం డాన్సర్స్ అసోసియేషన్‌లో హాట్ టాపిక్‌గా మారింది…

ఈ ఎన్నికల్లో సుమలత విజయం అంత సులువుగా జరగలేదనే చెప్పాలి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పొల్లకి విజయ్, జోజో శామ్, చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. అలాగే గతంలో జానీ మాస్టర్‌పై కేసు పెట్టి ఆయన జైలుకు వెళ్లడానికి కారణమైన డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచే ఎన్నికల హాల్‌లో ఉండి జోసెఫ్ ప్రకాశ్‌కు మద్దతుగా గట్టిగా ప్రచారం చేశారు.

జానీ మాస్టర్ భార్యని ఎలాగైనా ఓడించాలన్న కసితో ఆమె తిండి కూడా తినకుండా గంటల తరబడి అక్కడే ఉండి ఓట్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన విధానం ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేసింది. సుమలతను ఓడించాలనే లక్ష్యంతో సృష్టి వర్మ చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించలేదు. గ్రౌండ్ లెవల్‌లో సుమలతకు లభించిన మద్దతు ముందు అన్ని లెక్కలు తారుమార య్యాయి..

సీనియర్ మాస్టర్ల మద్దతు ఉన్నప్పటికీ జోసెఫ్ ప్రకాశ్ పరాజయం పాలవడం… ఎలాంటి క్యాంప్ పాలిటిక్స్ లేకుండా సుమలత గెలవడం అసోసియేషన్‌లో కొత్త చర్చకు తెరలేపింది. డాన్సర్స్‌లో నమ్మకం, వ్యక్తిగత అనుబంధం ఎంత ముఖ్యమో ఈ ఎన్నికల ఫలితం చెప్పకనే చెప్పింది. సింపుల్ క్యాంపెయిన్, స్పష్ట మైన మాట, నిజాయితీనే తన బలం అంటూ సుమలత ముందుకు వెళ్లిన తీరు చాలా మందికి ఆకట్టుకుంది.

ఈ విజయం వెనుక సుమలత జీవితంలో ఎదు ర్కొన్న కఠిన పరిస్థితులు కూడా ఒక కారణంగా పలు వురు పేర్కొంటున్నారు. గతంలో జానీ మాస్టర్‌పై వచ్చిన ఆరోపణల సమ యంలో ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి అంతా ఇంతా కాదు. ఆ సమ యంలో భర్తపై ఆరోపణలు రావడంతో కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది.

అయినప్పటికీ సుమలత భర్తకు అండగా నిలిచారు. కోర్టు కేసుల్లో, పోలీసు విచారణల్లో జానీ మాస్టర్‌కు ధైర్యం చెప్పుతూ… న్యాయ పోరాటంలో అతనితో పాటు ముందుకు నడిచారు. చాలా మంది వెనక్కి తగ్గిన సమయంలో ఆమె మాత్రం భర్త నిర్దోషేనన్న నమ్మకంతో దృఢంగా నిలబడటం ఇండస్ట్రీలో పలువురిని ఆకట్టుకుంది.

15 Mar 2026

Leave a Comment