డిసిసి అధ్యక్షుడిగా కైలాస్ నేతను కొనసాగించాలి – బీజ్జు దత్తాద్రి…
మంత్రి కోమటిరెడ్డి వైఖరి మార్చుకోవాలి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
పద్మశాలిలపై చిన్నచూపు ఎందుకు.? నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన పద్మశాలి నాయకుడు పొన్న కైలాస్ నేత ను కొనసాగిస్తూ న్యాయం చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బీజ్జు దత్తాద్రి డిమాండ్ చేశారు.
శనివారం ఆర్మూర్ మున్సిపాలిటీ టీచర్స్ కాలనీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ—
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి పద్మశాలి బిడ్డ కైలాస్ నేతకు డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం అభినందనీయం అన్నారు. అయితే ఈ నియామకానికి వ్యతిరేకంగా రోడ్డు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్రంగా ఖండించారు.
కైలాస్ నేత వంటి ఎదుగుతున్న పద్మశాలి నాయకుడిని అడ్డుకోవడం సమంజసం కాదని, ఆయనను పదవి నుంచి తొలగించాలని చూడడమే పద్మశాలిలను అణగదొక్కే ప్రయత్నమని దత్తాద్రి విమర్శించారు.
పద్మశాలి సమాజం మొత్తం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, కైలాస్ నేతను డిసిసి అధ్యక్ష పదవి నుంచి తొలగించే యత్నం జరిగితే ఐకమత్యంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
మంత్రి కోమటిరెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో మండలాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు తప్పవని తెలిపారు.
సమావేశంలో రాంపూర్ మాజీ సర్పంచ్, ఆర్మూర్ మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, చేనేత ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షుడు చిట్ల యగ్నేష్, పద్మశాలి హాస్టల్ జిల్లా ఉపాధ్యక్షుడు నూకల విజయసారథి, మాజీ కౌన్సిలర్ బండారి ప్రసాద్, రెండవ తర్ప అధ్యక్షుడు గుద్దేటి రాము, మాజీ అధ్యక్షుడు అంబల్ల శ్రీనివాస్, నియోజకవర్గ కోశాధికారి చెలిమెల రాజేందర్, 9వ తర్ప సంఘం అధ్యక్షుడు గంగుల పద్మయ్య, తిరుమల కాలనీ కార్యదర్శి సదాశివ్, సాయి ప్రణీత్, మ్యాకల దినేష్ తదితరులు పాల్గొన్నారు.






