విద్యను కార్పొరేట్ ఉత్పత్తిగా మార్చిన కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు….

On: Friday, November 28, 2025 9:12 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్: ప్రగతిశీల మహిళా సంఘం (POW) జాతీయ నాయకురాలు సంధ్య శుక్రవారం ఆర్మూర్‌లో జరిగిన నిజామాబాద్ జిల్లా 23వ మహాసభల్లో మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను కార్పొరేట్ వస్తువుగా మార్చుతున్నాయ‌ని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన విద్యాహక్కును నిర్వీర్యం చేస్తూ బడ్జెట్‌లో విద్యారంగానికి తగిన నిధులు కేటాయించకపోవడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని పేర్కొన్నారు.

దేశంలో నిరుద్యోగం పెరిగి విద్యార్థులు గిగ్ వర్కర్లుగా మారుతున్నారని, విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం పెంచుతున్నారని సంధ్య ఆక్షేపించారు. అసమానతలు లేని సమాజం కోసం విద్యార్థులు పోరాటస్ఫూర్తి పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.నాగరాజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయకరించేందుకు కొత్త జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, రాష్ట్రం ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. సంక్షేమ హాస్టెల్స్, గురుకులాల్లో సమస్యలు పెరిగిపోతున్నాయ‌ని ఆందోళన వ్యక్తం చేశారు.

సభకు జిల్లా అధ్యక్షులు ఆర్. గౌతమ్‌ కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా నేతలు పస్క నరసయ్య, ఎన్.దాసు, రాజేశ్వర్, ప్రిన్స్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొన్నారు.

10 Mar 2026

Leave a Comment