హైదరాబాద్, సెప్టెంబర్ 19:
హైటెక్ సిటీలోని ఇందిరా మహిళా శక్తి బజార్ నందు ‘సరస్ మేళా’ ను పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, “మహిళల ఆర్థిక సాధికారత దిశగా ఇలాంటి బజార్లు, మేళాలు మేళవింపు వేదికలుగా నిలుస్తాయి. గ్రామీణ మహిళలకు మార్కెట్ ప్రాప్యతను కల్పించే ఈ కార్యక్రమాలు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి” అని అన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రాంతీయ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, తెలంగాణ బాలుర పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సభ్యులు, తెలంగాణ మహిళా అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభ, వ్యవసాయ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, సెర్ప్ సీఈవో దివ్య దేవ్ రాజన్, అడిషనల్ సీఈవో కాత్యాయని, స్త్రీ నిధి ఎండి విద్యాసాగర్ రెడ్డి, WE హబ్ సీఈవో సీతా పల్లచోల తదితరులు పాల్గొన్నారు.
ఈ మేళాలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా స్వయం సహాయక బృందాలు తమ హస్తకళలు, ఆహార ఉత్పత్తులు, సాంస్కృతిక వస్తువులను ప్రదర్శించాయి. నగర ప్రజలకు గ్రామీణ ప్రతిభను పరిచయం చేస్తూ, గ్రామీణ మహిళల ఆర్థికంగా ఎదగడాన్ని ఉత్సాహపరిచేలా ఈ మేళా సాగుతోంది.





