ఎ9 న్యూస్, సిద్దిపేట, సెప్టెంబర్ 1:
రైతు అంటే కేవలం భూమిలో పంటలు పండించే వ్యక్తి మాత్రమే కాదు, దేశ అభివృద్ధికి మూలస్తంభం. రైతు లేని సమాజాన్ని ఊహించలేం. వ్యవసాయం లేకపోతే ఉపాధ్యాయుడు, శాస్త్రవేత్త, ఇంజనీర్, కలెక్టర్ ఎవ్వరూ తమ పనులు చేయలేరు. ఎందుకంటే ఆలోచన, జ్ఞానం అన్నీ ఆహారంతో పెరుగుతాయి. ఆ ఆహారం పండించేది రైతే.
అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మీయతను, ఓపికను నిర్లక్ష్యంగా తీసుకుంటోంది. యూరియా ఎరువు కోసం రైతులు రోజూ పగలు, రాత్రి – ఎండ, వాన ఏమాత్రం చూడకుండా – గంటల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబంతో సహా పొలానికి అవసరమైన రెండు మూడు బస్తాల యూరియాకు ఎదురుచూడాల్సిన దుస్థితి.
పెద్ద రైతులకు మాత్రం రాత్రిపూట, దొంగచాటుగా ఎరువులు సరఫరా అవుతున్నాయంటే, ఇందులో అధికారులు ప్రమేయం లేకుండా జరిగేదా? స్థానిక అధికారులు మిలాకతై, చిన్న రైతులను వేధిస్తున్నారు. ఇది తీవ్రంగా అభ్యంతరకరమైన విషయం.
ఇందుకే మేము డిమాండ్ చేస్తున్నాం:
➡️ ఎకరాకు కనీసం 4 యూరియా బస్తాలు సమృద్ధిగా, సమయానికి అందించాలి.
➡️ జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి.
➡️ రైతులకు పాక్షికంగా కాకుండా సమగ్ర న్యాయం జరగాలి.
ఇటీవల అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించగా, గ్రామాల్లోని వాస్తవ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. ఉదయం 4 గంటలకు లేచి, అన్నం తినకుండానే ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబడే రైతుల దుస్థితిని ఎవరు చూస్తారు?
ఈ పరిస్థితిని ప్రభుత్వం మిగతా వ్యవహారంలా తీసుకుంటే, రైతుల ఆగ్రహం ఎప్పుడు కట్టలు తెంచుకుంటుందో, ఎంత దూరం వెళ్తుందో ఊహించలేం. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలి.
రైతుల పోరాటానికి, నిరసనలకు నిరుపేదల హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతు ఇవ్వనుంది అని సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి తెలిపారు.







