A9 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 26 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ శనివారం వివరాలు వెల్లడించారు. బీర్కూర్‌లో ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న బోధన్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ అయాజ్, మహమ్మద్ సమీరుద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బాన్సువాడ, పిట్లం, బీర్కూర్, సదాశివ నగర్, గాంధారి, బిక్కనూరు, నిజామాబాద్, ఆర్మూర్, కమ్మర్పల్లి, సంగారెడ్డి జిల్లా కల్హేర్, శంకరంపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. అనంతరం నిందితుల నుంచి 26 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. కేసు ఛేదించిన రూరల్ సీఐ సత్యనారాయణ గౌడ్, బీర్కూర్ ఎస్సై రాజశేఖర్, పిట్లం ఎస్సై నరేష్, సిబ్బంది వసి, రఘు, సాయిబాబా, శివ చరణ్, అశోక్, సంగమేశ్వర్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు.