ఎA 9 న్యూస్ డెస్క్, ఆగస్టు 21, హైదరాబాద్
మంత్రి సీతక్క మేడారం సమ్మక్క సారక్క జాతరపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి జరగనున్న జాతరను ఈసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం జాతర ఏర్పాట్లకు పెద్దపీట వేసిందని తెలిపారు.
జాతర పనుల్లో కొత్త ప్రణాళికలు:
ఇప్పటివరకు తాత్కాలిక ఏర్పాట్లతో జాతర నిర్వహించినప్పటికీ, ఈసారి శాశ్వతంగా నిర్మాణాలు చేపడతామన్నారు.
జంపన్న వాగు అభివృద్ధి, రోడ్ల విస్తరణ, స్మృతి వన అభివృద్ధి వంటి పలు అంశాలు ఈ ప్రణాళికలో భాగమని చెప్పారు.
12 వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు కోసం మోహరించనున్నారు.
“13వ శతాబ్దం చరిత్ర కలిగిన ఈ జాతరను భవిష్యత్ తరాలకు గుర్తుండేలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం,” అని సీతక్క చెప్పారు.
పంచాయతీరాజ్ శాఖలో ‘పనుల జాతర’ ప్రారంభం:
మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ సంయుక్తంగా పంచాయతీ రాజ్ శాఖ పనుల జాతరకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
లక్షా 15 వేల పనులు రేపటి (ఆగస్టు 22) నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమానికి రూ. 200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, గొర్ల-మేకల షెడ్లు, తదితర మౌలిక వసతుల పనులు చేపట్టనున్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు.







