A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తోంది అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ పాదయాత్రను పురస్కరించుకొని, బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా నందిపేట్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ – “రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ప్రజల సమస్యలపై గళమెత్తే నాయకులను అరెస్టు చేయడం, గతంలో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని తలపిస్తుంది” అని విమర్శించారు.
నిజామాబాద్ జిల్లాలో ముందస్తు నోటీసులు లేకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రముఖులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నేతలతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.
అరెస్ట్ అయినవారిలో సీనియర్ నాయకులు బాలగంగాధర్, దేవేందర్ మనోజ్, ఎర్ర మురళి, సయ్యద్ హుస్సేన్, కొత్తూరు భరత్, భాస్కర్, దుబాయ్ శీను, గాండ్ల సంతోష్, దారం సురేష్, కె.జీ. సురేష్, ఎర్రటి మోహన్ బాబు, రాజ్ మురళి, రామారావు, రాజేందర్, నరేష్, శేఖర్ ప్రసాద్, అశోక్ తదితరులు ఉన్నారు.







