ఎర్రకోట పరేడ్లో సేవలందించిన వాడి గ్రామ వైద్యుడు డా. గోలి శ్రీనివాస్…
ఆర్మూర్,
వేల్పూర్ మండలం వాడి గ్రామానికి చెందిన డాక్టర్ గోలి శ్రీనివాస్ తనలోని వైకల్యాన్ని జయించి, దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వైద్య సేవలు అందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద కుటుంబంలో జన్మించిన ఆయన రెండో ఏట పోలియో బారిన పడి కుడికాలుకు వైకల్యం ఏర్పడినప్పటికీ, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఉన్నత స్థాయికి ఎదిగారు.
పదో తరగతి వరకు ఆర్మూర్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో, ఇంటర్ ఉప్పల్వాయి గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించారు. అనంతరం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 2006లో మెడిసిన్ పూర్తి చేశారు. 2013–14లో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో, 2015లో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. 2015 యూపీఎస్సీ ఎంపికలో సీఎంసీ బ్యాచ్‌కు ఎంపికై, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) క్యాడర్ కేటాయింపు పొందారు.
ఇంతకు ముందు 2023–24లో కర్తవ్యపథ్ (రాజ్‌పథ్)లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో రాష్ట్రపతి, ప్రధాని పాల్గొన్న కార్యక్రమాల్లో భారత రక్షణ బలగాలు, పోలీసు సిబ్బంది, పరేడ్లో పాల్గొన్న వారికి వైద్య సేవలు అందించారు. అలాగే 2022–23లో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్వచ్ఛందంగా మెడికల్ టీంకు నాయకత్వం వహించారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ క్యాడర్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల పాటు ఫిజికల్ టెస్టుల సమయంలో కూడా స్వచ్ఛంద వైద్య సేవలు అందించారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో తన వైకల్యాన్ని లెక్కచేయకుండా నిర్విరామంగా సేవలందించడంతో పాటు, సఫాయి కార్మికుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు.
“గర్వంగా ఉంది”
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి దేశ రాజధానిలో రాష్ట్రపతి, ప్రధాని వంటి ముఖ్యులకు వైద్య సేవలు అందించే బృందానికి నాయకత్వం వహించడం గర్వంగా ఉందని డాక్టర్ గోలి శ్రీనివాస్ తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, తనకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరి విజయంగా భావిస్తున్నానని అన్నారు.
“డాక్టర్ గోలి శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలనుండి స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట, కర్తవ్యపథ్‌ల వద్ద స్వచ్ఛందంగా వైద్య సేవలు అందిస్తూ తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు.”








