
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణ కేంద్రం చేపూర్ గ్రామ శివారులోని NH-63పై మంగళవారం సాయంత్రం 3:30 గంటల సమయంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సయ్యద్ అన్వర్ (50) అక్కడికక్కడే మృతి చెందగా, ఆటోలో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళితే…
వెల్పూర్ నుండి ఆర్మూర్ వైపు తన TS 16 U 0190 నంబర్ గల ఆటోను నడుపుకుంటూ వస్తున్న సయ్యద్ అన్వర్, షానిగారం లక్ష్మి అనే మహిళా ప్రయాణికురాలితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో బాబ్లూ దాబా సమీపానికి చేరుకోగానే, ఎదురు దిశ నుండి వచ్చిన AP 39 WD 9099 నంబర్ గల లారీ ఆటోను వేగంగా, నిర్లక్ష్యంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయి, డ్రైవర్ సయ్యద్ అన్వర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆటోలో ఉన్న ప్రయాణికురాలు షానిగారం లక్ష్మికి తలకు తీవ్ర గాయం కాగా, కాలు విరిగినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం నిజామాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
లారీని నిర్లక్ష్యంగా నడిపిన నిందితుడు తోట నాగరాజు (తండ్రి: కొండలు), జగ్గయ్యపేట గ్రామం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి, అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








