గంజాయి కేసును గోప్యంగా నడిపిన ఆర్మూర్ ఎక్సైజ్ శాఖ….

On: Saturday, January 10, 2026 11:30 AM

 

సీఐ గైర్హాజరీతో పెరిగిన అనుమానాలు…

ఆర్మూర్ పట్టణంలో నిషేధిత గంజాయి పట్టివేత ఘటనను ఎక్సైజ్ శాఖ గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పెర్కిట్ ప్రాంతంలో గురువారం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు 1200 గ్రాముల గంజాయిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నప్పటికీ, ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం.

గంజాయి పట్టుబడిన సమాచారం అందుకున్న స్థానిక విలేకరులు మధ్యాహ్నం ఒంటిగంటకు ఆర్మూర్ ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఎక్సైజ్ సీఐ అంజిత్ రావు భోజనానికి వెళ్లారని, రెండున్నర గంటలకు వస్తారని సిబ్బంది తెలిపారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల వరకు ఎదురు చూసినా సీఐ కార్యాలయానికి రాలేదు.

సీఐ గైర్హాజరీలో ఆర్మూర్ ఎస్ఐ, బాల్కొండ ఎస్ఐలు కేసు నమోదు చేసి పంచనామ తదితర ప్రక్రియలను పూర్తి చేశారు. గంజాయి పట్టివేతకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని విలేకరులు కోరగా, “సీఐ వచ్చిన తర్వాతే వివరాలు ఇస్తాం” అంటూ ఎస్ఐలు, కానిస్టేబుళ్లు సమాధానం దాటవేశారు. నలుగురు నిందితులను కోర్టులో హాజరు పరచాల్సి ఉందని పేర్కొంటూ కీలక సమాచారం వెల్లడించలేదు.

సాయంత్రం ఐదు గంటలు దాటినప్పటికీ సీఐ రాకపోవడంతో, ఎస్ఐలు మరియు కానిస్టేబుళ్లు హడావుడిగా గంజాయితో పట్టుబడ్డ నలుగురు నిందితులను వాహనంలో తీసుకెళ్లి రిమాండ్‌కు తరలించారు. గంజాయి విలువ, పట్టుబడిన పరిస్థితులు వంటి కీలక వివరాలను మీడియాకు వెల్లడించకుండానే కేసును గోప్యంగా నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు విలేకరులు ఎక్సైజ్ సీఐ అంజిత్ రావుకు పలుమార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం గమనార్హం. ఆర్మూర్‌కు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సీఐ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం అలవాటుగా మారిందని స్థానికులు, జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్లినా సీఐ అందుబాటులో ఉండకపోవడం వల్ల కీలక సమాచారం తెలుసుకోవడం కష్టంగా మారిందని వారు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.

 

13 Mar 2026

Leave a Comment