బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆవుల రాజిరెడ్డి విమర్శలు….
ఎ9 న్యూస్, మాసాయిపేట (మెదక్) | జనవరి 4
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ పథకం అమలైనా స్థానిక నాయకుల చేతివాటం ఉండేదని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. ఆదివారం మాసాయిపేట గ్రామంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో మైనార్టీ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాసాయిపేట గ్రామంలో గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు కాలేదని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన నిరుపేదలను గుర్తించి మొత్తం 49 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అసలైన గరీబోళ్లను సేకరించి అర్హులను ఎంపిక చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల లబ్ధిదారులు మాసాయిపేటలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తూ, మాజీ మంత్రి హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణానికి కేటాయించిన రూ.25 వేల కోట్ల బడ్జెట్ ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పసుల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు ముక్క దశరథ్, వార్డు సభ్యులు పెరుమల్ల రమేష్, మాజీ సొసైటీ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








