నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగతనాలపై బ్యాంకు మేనేజర్లు, క్యాష్ సప్లై ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించిన పోలీస్ కమీషనర్….

On: Thursday, January 1, 2026 5:49 AM

 

పోలీస్ కమీషనర్ కార్యాలయం, నిజామాబాదు

తేది: 31-12-2025.

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల ఏటీఎం సెంటర్లు, బ్యాంకుల్లో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో నేడు పోలీస్ కమీషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల అధికారులు, క్యాష్ సప్లై ఏజెన్సీల ప్రతినిధులతో సమన్వయ–భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి గౌరవనీయులు నిజామాబాదు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్., గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారు మాట్లాడుతూ, జిల్లాలో ఇటీవల కొన్ని ఏటీఎం సెంటర్లలో దొంగతన ఘటనలు చోటుచేసుకోవడం పట్ల పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తున్నదని తెలిపారు. ప్రజలు బ్యాంకుల్లో భద్రపరచుకున్న డబ్బుల భద్రత విషయంలో బ్యాంకులు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

ప్రతి ఏటీఎం సెంటర్‌లో పనిచేసే విధంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటి రికార్డింగ్ కనీసం 30 రోజులపాటు భద్రపరచాలని సూచించారు. అలాగే అలారం వ్యవస్థలు, సెక్యూరిటీ గార్డుల ఏర్పాటు, సరైన లైటింగ్ వంటి భద్రతా చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఏటీఎం సెంటర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు. క్యాష్ లోడింగ్ సమయంలో ఏటీఎం సెంటర్ల పరిస్థితిని తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.

పోలీస్ శాఖ బ్యాంకుల సహకారంతో సమన్వయంగా పనిచేస్తూ, సమాజానికి నష్టం కలగకుండా ఇలాంటి నేరాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమీషనర్ గారు స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటంలో బ్యాంకులు–పోలీస్ శాఖ పరస్పర సహకారం ఎంతో కీలకమని, ప్రజల ఆస్తి భద్రతే లక్ష్యంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారుల అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శ్రీ జి. బస్వా రెడ్డి, నిజామాబాదు ఏసీపీ శ్రీ రాజా వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ వై. వెంకటేశ్వర్ రావ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీ సునీల్, అలాగే నిజామాబాదు జిల్లా లోని అన్ని బ్యాంకు మేనేజర్లు, నిజామాబాదు టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, నిజామాబాదు నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

పోలీస్ పి.ఆర్.ఓ,

పోలీస్ కమీషనర్ కార్యాలయం,

నిజామాబాదు.

11 Mar 2026

Leave a Comment