తెలంగాణ ఆదర్శ జూనియర్ కళాశాలలో సోమవారం రోజున దసరా సెలవుల సమయంలో ఇంటెన్షిప్ ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సర్టిఫికెట్లను మండల అధికారులు, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు, వొకేషనల్ ఉపాధ్యాయులు మరియు కళాశాల ప్రిన్సిపల్ గారు సంయుక్తంగా అందజేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి మాట్లాడుతూ, వొకేషనల్ విద్య అనేది కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించిన ఒక విలువైన వరమని పేర్కొన్నారు. అదనంగా, కళాశాల ద్వారా విద్యార్థులకు నైపుణ్యాధారిత కంప్యూటర్ విద్యతో పాటు అసిస్టెంట్ ఫ్యాషన్ డిజైన్ విద్యను అందిస్తున్నామని తెలిపారు.
దసరా సెలవుల సందర్భంగా మొత్తం 69 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఇంటెన్షిప్ కార్యక్రమంలో పాల్గొని, కళాశాలలో నేర్చుకున్న విద్యను ప్రాయోగికంగా ఉపయోగించుకునేలా ముందుగానే ఎంపిక చేసిన వివిధ సంస్థల్లో పనిచేస్తూ ప్రత్యక్ష అనుభవాన్ని పొందారని తెలిపారు. ఈ పది రోజుల కాలంలో విద్యార్థులు నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకొని, వృత్తిపరమైన అవగాహనను సంపాదించారని చెప్పారు.
ఇంటెన్షిప్ పూర్తి చేసిన విద్యార్థులు, తాము నేర్చుకున్న నైపుణ్యాలను పీపిటీ ప్రెజెంటేషన్ ద్వారా తమ తల్లిదండ్రులకు మరియు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు వివరించారు. ఒక్కో విద్యార్థి తన అనుభవాలను, ఆ పది రోజుల్లో పొందిన జ్ఞానం మరియు అనుభూతులను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఈ విధమైన అవకాశాన్ని కల్పించిన కళాశాల ప్రిన్సిపల్ గారికి, వొకేషనల్ ఉపాధ్యాయులకు మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, ఉపాధ్యాయ సిబ్బంది, వొకేషనల్ టీచర్స్ సురేష్, స్వాతి, మండల అధికారులు, అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






