
A9 న్యూస్:
అయోధ్య శ్రీ బాలరాముని పవిత్ర బంగారు పాదుకలు, బంగారు ధనస్సు, బాణం ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో భక్తుల దర్శనార్థం ఉంచడంతో గురువారం ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. సనాతన ధర్మ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లో విస్తరింపజేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధార్మిక యాత్రలో భాగంగా చల్ల శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పవిత్ర వస్తువులను ఆలయానికి తీసుకువచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. బాలరాముని బంగారు పాదుకలు, ధనస్సు, బాణాన్ని దర్శించుకునేందుకు ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అయోధ్య నుంచి తీసుకువచ్చిన ఈ పవిత్ర చిహ్నాల దర్శనం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. సనాతన ధర్మ పరిరక్షణ సందేశాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దర్శనం చేసుకోవాలని కోరారు.








