A9 న్యూస్ నిజామాబాద్;
నిజామాబాదు జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (SRSP)లోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నాటికి ప్రాజెక్టులోకి 26,745 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 1066.1 అడుగులు ఉండగా, 17.453 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి మొత్తం 751 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం స్పిల్వే గేట్లు, ఎస్కేప్ గేట్లు, ఫ్లడ్ ఫ్లో కాలువ ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు. కాకతీయ కాలువకు 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా, 220 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో నష్టమవుతోంది. అధికారులు ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.








