రూ.25 వేల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత…..
మెదక్ జిల్లా ,నర్సాపూర్ డివిజన్‌లో విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్) ఏసీబీ వలలో చిక్కాడు. అధికారిక పనికి సంబంధించి లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, నర్సాపూర్ డివిజన్‌లో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న ముద్దం రమణారెడ్డి, ఫిర్యాదుదారుడికి సంబంధించిన 11 వర్క్ బిల్లులను ముందుకు పంపేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. మొత్తం రూ.3,13,882 విలువైన బిల్లులను డివిజనల్ ఇంజనీర్ కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడానికి ఈ డబ్బు కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం సుమారు 12:40 గంటల సమయంలో తన కార్యాలయంలోనే లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.25 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగిగా విధులను దుర్వినియోగం చేసి అక్రమ లాభం పొందేందుకు ప్రయత్నించినందుకు సంబంధిత అధికారిని అరెస్ట్ చేసి, హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.







