జగిత్యాలలో రైతుల వడ్ల కొనుగోలుపై మాట్లాడిన డ్రైవర్‌కు వేటు.. రాజకీయ దుమారం….

On: Wednesday, May 27, 2026 9:51 AM

జగిత్యాలలో “ముందు వడ్లు కొనండి” అని మంత్రి, కాంగ్రెస్ నేతలకు సూచించిన ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అశోక్‌పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది.

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్న సమయంలో అశోక్ “ముందు రైతుల వడ్లు, మొక్కజొన్న కొనుగోలు చేయండి” అని వ్యాఖ్యానించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అనంతరం కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు జగిత్యాల డిపో అధికారులు అతడిని విధుల నుంచి తప్పించినట్లు వార్తలు వెలువడ్డాయి.

డ్రైవర్ అశోక్ మాత్రం తాను ఏ రాజకీయ పార్టీని లేదా నాయకుడిని విమర్శించలేదని, రైతుల సమస్యల గురించి మాత్రమే మాట్లాడానని స్పష్టం చేశాడు. “పెట్రోల్, డీజిల్ గురించి తర్వాత మాట్లాడొచ్చు.. ముందు రైతుల ధాన్యం కొనండి” అన్నానని తెలిపాడు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు, గంగుల కమలాకర్, కవిత తదితరులు అశోక్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై మాట్లాడినందుకు ఉద్యోగం తీసేయడం సరైంది కాదని విమర్శించారు.

ఇక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. అశోక్‌ను ఉద్యోగం నుంచి తొలగించలేదని, అతను రెగ్యులర్ ఆర్టీసీ ఉద్యోగి కాకుండా హైర్ బస్సు డ్రైవర్ మాత్రమేనని చెప్పారు. అతడిని పనిలో నుంచి తీసేయొద్దని బస్సు యాజమాన్యానికి సూచించామని, రైతుల పక్షాన మాట్లాడిన వ్యాఖ్యలను ప్రభుత్వం స్వాగతిస్తోందని తెలిపారు.

27 May 2026

Leave a Comment