తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శనివారం అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సిద్ధిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం అక్కడికి చేరి ఆయనకు చికిత్స అందిస్తోంది.
వైద్య వర్గాల సమాచారం ప్రకారం, కేసీఆర్ రక్తంలో చక్కెర (షుగర్) మరియు సోడియం స్థాయిల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈ మార్పులను దృష్టిలో పెట్టుకొని వైద్యులు ఆయన్ని నిఘాలో ఉంచి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఫాంహౌస్‌లోనే వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తన కుమారుడు హిమాన్షుతో కలిసి ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఫాంహౌస్‌కి వెళ్లి వైద్యుల నుంచి సమాచారం అందుకున్నారు.
వైద్యులు కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం గమనిస్తూ అవసరమైన సేవలు అందిస్తున్నారు. పరిస్థితి మెరుగుపడకపోతే, ఆయనను హైదరాబాద్‌లోని ఓ స్పెషలైజ్డ్ హాస్పిటల్‌కు తరలించే యోచన కూడా ఉన్నట్లు సమాచారం.





