శ్రీనగర్, జాకోర గ్రామాల్లో 31 సీసీ కెమెరాలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య….
ప్రజల భాగస్వామ్యంతో భద్రత మరింత పటిష్టం..
“మన ఊరు – మన భద్రత – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ని మండలంలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో ఏర్పాటు చేసిన 31 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ బుధవారం ప్రారంభించారు. శ్రీనగర్ గ్రామంలో 15, జాకోర గ్రామంలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహకరించిన గ్రామ పంచాయతీలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసు సిబ్బందితో సమానంగా పనిచేస్తుందని అన్నారు. గ్రామాల్లో జరిగే అనుమానాస్పద కదలికలను గుర్తించడం, నేరాలను అరికట్టడం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి ఇల్లు, దుకాణం, వ్యాపార సంస్థ భద్రత కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలని సూచించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్ఐ జి. వంశీకృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోర సర్పంచ్ బి. పెద్ద సాయిలు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.








