నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే వేదికగా కాంగ్రెస్ నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరనుండగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు అంతా సిద్ధం చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిశీలించి, సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించనున్న బీఆర్‌ఎస్ కార్యకర్తల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హాజరు కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటన అనంతరం తొలిసారిగా ఎమ్మెల్సీ కవిత జగిత్యాలకు వస్తున్న నేపథ్యంలో భారీగా స్వాగతం పలకడంతో పాటు, విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అసెంబ్లీ సంజయ్‌కుమార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జగిత్యాలపై ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టి
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉన్న జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంపై 2014 నుంచి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక దృష్టిని సారించిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో రాష్ట్ర ఆవిర్భావ అనంతరం నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసిన కవిత, జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్‌కుమార్‌ను ఏరికోరి ఎంపిక చేసి బరిలో నిలిపారు.
పార్టీలో చేరిన నెలరోజుల్లోపే ఎన్నికల క్షేత్రంలోకి దిగిన సంజయ్‌ను గెలిపించేందుకు కవిత సర్వశక్తులు ఒడ్డి పోరాడారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేతిలో సంజయ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే సంజయ్ ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ, ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జిగా ప్రకటించిన కవిత, అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం చేశారు. నియోజకవర్గం కోసం కోరిన ప్రతి అభివృద్ధి పనిని ఎమ్మెల్సీ కవిత మంజూరు చేయించడంతో పాటు, అని సంక్షేమ పథకాలు జగిత్యాలలో అమలయ్యేలా చూశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.300 కోట్లతో 4,500 డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయించారు.
నాలుగేండ్ల వ్యవధిలో కవిత నేతృత్వంలో సంజయ్‌కుమార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఫలించాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ 60వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కవిత జగిత్యాల నుంచే జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్నట్లే జగిత్యాల నుంచే బీఆర్‌ఎస్ విజయ పరంపర మొదలు కావడం విశేషం. కాగా ఈ సారి సైతం అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి జైత్రయాత్ర ప్రారంభమయ్యేలా చూడాలని బీఆర్‌ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పట్టుదలతో శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో భారీ స్థాయిలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.
చల్‌గల్ గ్రామ శివారులో ఉన్న మామిడి మార్కెట్ ఆవరణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జగిత్యాల పట్టణంతో పాటు, జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్, బీర్‌పూర్, రాయికల్ మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభించి, మధ్యాహ్నం 3 గంటల దాకా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కార్యకర్తలు తీసుకోవాల్సిన చర్యలు, ప్రతిపక్షాల చేసే ఆరోపణలు, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టే వ్యూహాలు, ప్రచారం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సోషల్ మీడియా ప్రచారం, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చే విషయంలో కార్యకర్తల పాత్ర తదితర అంశాలన్నింటిపై సుదీర్ఘంగా చర్చించి వ్యూహం రచించనున్నారు.
బీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు?
జగిత్యాల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలుండే అవకాశం ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన కొందరు కీలక నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో పార్టీలో చేరడానికి సంసిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు, ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి కంచుకోటగా పేరుగాంచిన జగిత్యాలలో పార్టీకి దాదాపు తొమ్మిదేండ్ల నుంచే బీటలు పడడం ఆరంభమైంది. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లోనూ శ్రేణులు గులాబీదళం గూటికి చేరుకున్నారు. మార్కెట్ కమిటీ దామోదర్‌రావు నుంచి మొదలు కొని మాజీ ఎంపీపీలు ఎల్లారెడ్డి, రాజిరెడ్డి, పదుల సంఖ్యలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, యువజన సంఘ నాయకులు పార్టీలో చేరారు. కీలకమైన వ్యక్తులు, నాయకులు పార్టీని వీడడంతో కాంగ్రెస్ జగిత్యాలలో బలహీనపడింది. కాగా, తాజాగా కాంగ్రెస్‌లో మిగిలిన మరికొందరు ముఖ్య నాయకులు పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మున్సిపల్ మాజీ చైర్మన్‌తో పాటు, నలుగురు కౌన్సిలర్లు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఆయన తమ్ముడికి అత్యంత సన్నిహితుడిగా పేరుపడిన ఓ కీలక యువజన నాయకుడు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు వారం రోజుల కిందే ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అయితే కొన్ని అనివార్య కారణాల నేపథ్యంలో ఈ చేరిక వాయిదా పడింది. అయితే జగిత్యాల నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది.
సభను విజయవంతం చేయండి : ఎమ్మెల్యే సంజయ్
నేడు నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం చల్‌గల్ మామిడి మార్కెట్‌లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి సకాలంలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.