
ఆర్మూర్: ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన దమ్మడి ఎర్రవ్వ అనే ఎస్సీ (మాల) మహిళ తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ ఆర్మూర్ ఎంఆర్వోతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఎర్రవ్వ జోగిని వ్యవస్థ నిర్మూలన పునరావాస పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1.18 ఎకరాల భూమి పొందినట్లు తెలిపారు. ఆ భూమి గుట్ట ప్రాంతంలో ఉండటంతో క్రమంగా సాగుకు అనుకూలంగా మార్చుకుంటూ సాగు చేస్తున్న సమయంలో కొందరు అక్రమంగా భూమిని కబ్జా చేసి, దోబీఘాట్ నిర్మించి బోరు ఏర్పాటు చేశారని ఆరోపించారు. దీంతో తమ భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు, తనపై మరియు తన కుమారుడిపై భౌతిక దాడులు చేస్తూ దుర్భాషలాడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ సహా అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని, తమ భూమిని తిరిగి అప్పగించి న్యాయం చేయాలని ఎర్రవ్వ అధికారులను కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఇత్వర్పేట్ లింగన్న పాల్గొని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.








