హైదరాబాద్, జూలై 17: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక గృహజ్యోతి పథకంపై ఎల్నినో ప్రభావం పడింది. వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫ్యాన్లు, కూలర్లు, బోర్ మోటార్ల వినియోగం పెరగడంతో అనేక కుటుంబాల విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటింది. దీంతో జీరో విద్యుత్ బిల్లు ప్రయోజనం కోల్పోతున్నారు.
ఉత్తర తెలంగాణ ఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో జూన్ నెలలో సుమారు 4 లక్షల మంది లబ్ధిదారులు పథకం పరిధి నుంచి బయటపడ్డారు. మొత్తం 26.54 లక్షల అర్హుల్లో 22.59 లక్షల మందికే జీరో విద్యుత్ బిల్లులు అందగా, ప్రభుత్వం ఇందుకోసం రూ.99.18 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది.
విద్యుత్ వినియోగం పెరగడంతో బిల్లులు అధికంగా రావడం వల్ల పలువురు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 200 యూనిట్ల పరిమితిని మించకుండా విద్యుత్ వినియోగంపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.








