ఆర్మూర్, జూలై 17: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో గురువారం ఇస్కాన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
పెర్కిట్ హనుమాన్ చౌరస్తా వద్ద ప్రారంభమైన రథయాత్ర మామిడిపల్లి చౌరస్తా, కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, పాత బస్టాండ్, అంగడి బజార్ మీదుగా బాలాజీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పూరిలో జరిగే జగన్నాథ రథయాత్ర తరహాలో ఆర్మూర్లో కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.
రథయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.








