ఆర్మూర్‌లో కాంగ్రెస్ కౌంటర్.. ఎమ్మెల్యేకు హామీల అమలుపై ప్రశ్నలు…

On: Friday, July 3, 2026 8:18 PM

*ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్.. హామీల అమలుపై దృష్టి పెట్టాలని    డిమాండ్‘…                                                *రూ.1కే వైద్యం.. గ్రామానికి 10 ఇళ్లు ఎక్కడ?’ ఎమ్మెల్యేపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం…

 

ఆర్మూర్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌పై ఆర్మూర్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆర్మూర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ప్రస్థానాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.

విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్‌యూఐలో జిల్లా అధ్యక్షుడిగా, అనంతరం రాష్ట్ర స్థాయిలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ అని తెలిపారు. ఆయన సేవలను గుర్తించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించిందన్నారు.

సింగూర్ జలాల పరిరక్షణ, అభివృద్ధి కోసం మహేష్ కుమార్ గౌడ్ అనేక ఉద్యమాలు నిర్వహించి జైలుకు కూడా వెళ్లారని, నిజామాబాద్ జిల్లాకు సింగూర్ జలాల విషయంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. “ఒక్క రూపాయికే వైద్యం”, “గ్రామానికి 10 ఇళ్లు” వంటి హామీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. ప్రజల అభివృద్ధిపై దృష్టి సారించకుండా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యం కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, దాని నాయకత్వంపై వ్యక్తిగత విమర్శలు కొనసాగితే ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ప్రజాతీర్పును కోరాలని సవాలు విసిరారు.

ఈ సమావేశంలో ఆర్మూర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

03 Jul 2026

Leave a Comment