రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ చేసిన సీఎం రేవంత్ రెడ్డి….

On: Tuesday, June 30, 2026 9:04 PM

 

హైదరాబాద్:

తెలంగాణ రైతాంగానికి పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేశారు.

మొత్తం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయాలనే లక్ష్యంతో తొలి విడతగా 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల రుణమాఫీ, గత ప్రభుత్వ బకాయి రూ.7 వేల కోట్ల రైతు భరోసా నిధుల చెల్లింపు, రైతు భరోసా మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంపు వంటి చర్యలను వివరించారు.

ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమ చేశామని, తాజా విడతతో కలిపి మొత్తం రూ.36 వేల కోట్లు రైతు భరోసా కింద చెల్లించినట్లు పేర్కొన్నారు. అలాగే పంట బోనస్, వ్యవసాయ పనిముట్లు, బీమా, ధాన్యం కొనుగోళ్ల కోసం కూడా భారీగా నిధులు వెచ్చించినట్లు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, వ్యవసాయ రంగంలో చేపట్టిన చర్యలపై శాసనసభలో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

30 Jun 2026

Leave a Comment