తపస్వి సంస్థకు అండగా నిలవాలని ప్రజల విజ్ఞప్తి…. *యజమానికి వత్తాసు పలుకుతున్న పోలీస్ డిపార్ట్మెంట్….
ఆర్మూర్,
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్ల ప్రాంతంలో ఉన్న ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ తపస్విలో ఆశ్రయం పొందుతున్న అనాధ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా అనాధ, నిరుపేద పిల్లలకు ఆశ్రయం, విద్య, భోజనం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సేవలందిస్తున్న ఈ సంస్థ ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
సంస్థ నిర్వహణ వర్గాల కథనం ప్రకారం, నిధుల కొరత కారణంగా అద్దె చెల్లింపుల్లో జాప్యం ఏర్పడటంతో భవన యజమానిని కొంత గడువు ఇవ్వాలని కోరగా, పోలీసుల సమక్షంలో జూన్ 10వ తేదీ వరకు సమయం ఇవ్వాలని అంగీకారం జరిగినట్లు చెబుతున్నారు. అయితే గడువు ముగియకముందే భవన యజమాని హరిజీవన్ కొందరితో కలిసి వచ్చి పిల్లలు నివసిస్తున్న ప్రాంగణాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.
ఈ సందర్భంగా పిల్లలు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లు, బాత్రూమ్‌లను ధ్వంసం చేశారని, అడ్డుకునేందుకు ప్రయత్నించిన సంస్థ సభ్యుడు శ్రీనివాసరావుపై దాడి జరిగినట్లు సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనతో చిన్నారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా తపస్వి సంస్థకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, దాతలు వచ్చి పిల్లలకు సహాయం అందిస్తూ ప్రోత్సహించిన సందర్భాలు అనేకం ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అలాంటి సమయంలో ప్రస్తుతం సంస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ ప్రముఖులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అనాధ పిల్లల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, దాతలు వెంటనే స్పందించి సంస్థకు అవసరమైన సహాయం అందించాలని, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.








