తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడ్రోజులు వర్షాలు, ఈ జిల్లాలకు అలర్ట్….

On: Saturday, March 28, 2026 11:55 AM

 

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

నేటి నుంచి మార్చి 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

భారీ వర్షాలకు తోడు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలో నేడు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని చెప్పారు. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

దంచికొడుతున్న ఎండలు..

ఓ వైపు వర్షాలు కురుస్తున్నా.. మరోవైపు భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శుక్రవారం (మార్చి 27) హైదరాబాద్ నగరంలోని రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. తీవ్ర ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలు అయితే చాలు నిప్పుల వర్షం కురిసినట్లుగా అనిపిస్తోంది. దీంతో ప్రజలు ఇంటికే పరిమితమై ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. తీవ్రమైన ఎండలతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. పగలు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు ఏరియాల్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరవాసులకు ఆహ్లాదాన్ని కలిగించింది. తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఉపశమనం కలిగించింది. నేడు కూడా సాయంత్రం తర్వాత నగరంలో వర్షం కురిసే అవకాశం ఉండటంతో వాతావరణం చల్లబడనుంది.

28 Mar 2026

Leave a Comment