⦿ మరో ఎన్నికల హామీ అమలుకు సర్కారు రెడీ
⦿ రేపు గాంధీభవన్‌లో కీలక భేట
⦿ హాజరు కానున్న సీఎం, ఇన్‌ఛార్జ్ మున్షీ, కీలక నేతలు
⦿ కులగణనపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష
⦿ 7 పేజీలు, 75 ప్రశ్నలతో ప్రశ్నావళి రెడీ
⦿ నవంబరు 6 నుంచి నెలాఖరు వరకు గణన
⦿ 80 వేల ఉద్యోగులతో పక్కాగా ఇంటింటి సర్వే
⦿ గణన తర్వాత రాహుల్ గాంధీతో భారీ సభకు యోచన
హైదరాబాద్ : తెలంగాణలో కులగణకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో దీనికి సంబంధించిన కీలక సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు తదితరులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో నవంబరు 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న కులగణనపై పార్టీ పరంగా లోతుగా చర్చించి, దీనిపై పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. కాగా, ఈ కీలక భేటీ కారణంగా బుధవారం గాంధీభవన్‌లో జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం వాయిదా పడింది. తదుపరి కార్యక్రమం ఎప్పుడు ఉంటుందో త్వరలో తెలియజేస్తామని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి.
అందుకే కీలక భేటీ –
గత అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి, వెనకబడిన కులాలకు తగిన ప్రయోజనం చేకూరేలా పథకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడటం, ఆ తర్వాత దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవటం జరిగాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం నవంబరు 6 నుంచి తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరపనుంది. దీనికోసం 80 వేల మంది ఉద్యోగులను కేటాయించి ఇంటింటి సర్వేతో పక్కాగా గణాంకాలు సేకరించనుంది. ఈ విషయంలో లోతుగా చర్చించి పార్టీ పరంగా ఒక కార్యాచరణ తీసుకునేందుకే నేడు గాంధీ భవన్‌లో ఈ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఇందులో కీలక నేతలు కులగణనపై లోతుగా చర్చించనున్నారు.
పక్కాగా లెక్క –
మొత్తం 75 ప్రశ్నలతో 7 పేజీలతో కులగణన ఫార్మెట్‌ను ప్రభుత్వం రెడీ చేసింది. ఇందులో 56 ప్రధాన ప్రశ్నలతోపాటు 19 అనుబంధ ప్రశ్నలంటాయి. పార్ట్-1లో యజమాని, కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలకు సంబంధించి 58 ప్రశ్నలుండగా.. పార్ట్-2లో కుటుంబ యజమానితోపాటు ఇతర సభ్యుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తారు. పార్ట్-1లో వ్యక్తుల మతం, సామాజిక వర్గం, ఉప కులంతోపాటు మాతృభాష, వైవాహిక స్థితి, విద్యార్హతలు, ఉద్యోగం, ఉపాధి, కుల వృత్తి, వార్షికాదాయం, ఐటి రిటర్న్, స్థిరాస్తులు, పొలం పాస్‌బుక్ నెంబర్, రిజర్వేషన్‌తో పొందిన ప్రయోజనాలు, గత ఐదేళ్లలో పొందిన పథకాల వివరాలు, రాజకీయ నేపథ్యం, వలస వివరాలున్నాయి. అలాగే, ఈ సర్వేలో గత ఐదేళ్లలో తీసుకున్న రుణాలు, కుటుంబానికి ఉన్న పశుసంపద, రేషన్ కార్డు నెంబరు, నివాస గృహం రకం, గ్యాస్ కనెక్షన్ వివరాలూ సేకరిస్తారు. కాగా, ఈ సర్వేలో ఆధార్ వివరాలివ్వటం తప్పనిసరి కాదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.
*రాహుల్ సభకు యోచన –*
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం కులగణన చేపడుతున్న నేపథ్యంలో త్వరలో అగ్రనేత రాహుల్ గాంధీతో సభ ఏర్పాటు చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హజరయ్యే ఈ సమావేశానికి అన్ని కులసంఘాల నేతలు, మేధావులు, ఉద్యమకారులను ఆహ్వానించాలని టీపీసీసీ భావిస్తోంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికలు కాగానే ఈ సభకు తప్పక వస్తానని ఇప్పటికే ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కులగణన ద్వారా అసలు లెక్కలు తీసి, అభివృద్ధిలో వెనకబడిన వర్గాలను భాగస్వాములను చేయటానికి సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం, సామాజిక న్యాయం అనే మాటను అమలు చేస్తోందనే సందేశాన్ని ఈ సభ ద్వారా ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.