హైదరాబాద్: తెలంగాణలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు కార్యాచర ప్రణాళికను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. వేసవి సన్నద్ధతపై శనివారం ఆమె మిషన్‌భగీరథ ఈఎన్‌సీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజూ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేయాలన్నారు. పైపులైనుల లీకేజీని సరిదిద్ది నీటి సరఫరాను 24 గంటలలో పునరుద్ధరించాలన్నారు. ‘‘వేసవిలో నదులు, రిజర్వాయర్ల వంటి తాగునీటి వనరుల నీటి మట్టం స్థాయులను నిరంతరం పర్యవేక్షించాలి. చేతి పంపులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ పంపుల మరమ్మతులు చేపట్టాలి. మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ట్యాంకర్ల ద్వారా సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయాలి. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, అతిసారం కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గ్రామాలలోని ఓవర్ హెడ్ ట్యాంకులలో ప్రతిరోజూ క్లోరినేషన్ చేయాలి. 10 రోజులకు ఒకసారి ట్యాంకులను శుభ్రపరచాలి. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలి.’’ అని మంత్రి ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి లోకేశ్‌కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్‌రెడ్డి, ఇతర చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.